
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 22: కరీంనగర్లో మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెన పనులపై నెలాఖరులోగా విజిలెన్స్ నివేదికను అందజేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ హయాంలో మొదట రూ.80 కోట్లు కేటాయించి, ఆ తర్వాత అప్రోచ్ రోడ్లతో కలిపి మొత్తం రూ.224 కోట్ల వ్యయంతో ఈ వంతెనను పూర్తి చేశారు.
వంతెన ప్రారంభించిన నాలుగు నెలలకే తారు పాడవడం, డిజిటల్ లైట్లు పనిచేయకపోవడం లాంటి లోపాలు వెలుగు చూసాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక కార్యకర్తలు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన ప్రభుత్వం పనుల నాణ్యతపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ద్వారా విచారణ చేపట్టింది. విభాగ డీఎస్పీ ఎం. శ్రీనివాస్ రావు నేతృత్వంలోని బృందం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టి ఏడాది పాటు విచారణ నిర్వహించింది. ప్రస్తుతం ఈ విచారణ తుదిదశకు చేరుకోగా, ఈ నెలాఖరులోగా తుది నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
