
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 23: హుజూరాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామంలో భూ వివాదం ఓ రైతు ప్రాణాలను బలిగొంది. గ్రామానికి చెందిన రైతు అమ్ముల ఐలమల్లు (53) భూమి విషయంలో జరుగుతున్న కలహాలతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై మృతుడి కుమారుడు దేవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జూన్ 21న గ్రామస్థులు ముష్కే మల్లయ్య, ముష్కే కుమార్, ముష్కే అశోక్, ముష్కే రాజమ్మ, ముష్కే శ్రీలత, ముష్కే రమ, పెసర రాజు, పాకాల నారాయణరెడ్డి లు భూ వివాదంలో ఆయనను తీవ్రంగా దూషించి, ‘నీవు ఎందుకు బతుకుతున్నావ్?’ అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. గడ్డి మందు తాగిన ఐలమల్లును కుటుంబసభ్యులు హుటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఏకశిలా ఆసుపత్రికి, ఆపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించి జూన్ 23 ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి,ఎనిమిది మందిపై దర్యాప్తు ప్రారంభించారు.

అమ్ముల ఐలమల్లు (53)ఫైల్

మృతుడు అమ్ముల ఐలమల్లు (53)





