
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ , జూన్ 23: ప్రభుత్వ భూమి ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని, దీంతో వారు తనపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తూ సింగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సదరు రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సింగాపూర్ గ్రామంకు చెందిన రైతు అమ్ముల ఐలుమల్లు(65) గ్రామ శివారులో 14ఏ డీబీఎం కాకతీయ కాలువ పరిధిలోని 87 సర్వే నంబరులో 12 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన బైరి రామస్వామి వద్ద నుంచి ముష్క మల్లయ్య, అశోక్, కుమార్ కొనుగోలు చేశారు. ఇందులో నుంచి ఎకరం 11 గుంటల భూమి కాకతీయ కాలువ కింద పోయింది. అప్పుడు ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారుల తప్పిదంతో ఈ భూమికి పట్టా ఇచ్చారు. దీనిపై ఈ భూమి పక్కన ఉన్న రైతు అమ్ముల ఐలుమల్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు సర్వే చేసి ఎకరం 11 గుంటల భూమి ఎస్సారెస్పీదేనని తేల్చారు. అందులో నుంచి మట్టి తీయడం, ఆక్రమించడం చేయవద్దని సంబంధిత రైతులు ముష్క మల్లయ్య, అశోక్, కుమార్ హెచ్చరించారు. అయినప్పటికీ గత రెండు రోజుల నుంచి ముష్క మల్లయ్య కుటుంబ సభ్యులు ఎస్సారెస్పీ భూమి నుంచి మట్టి తవ్వకాలు చేపట్టారు. దీనిపై ఐలుమల్లు మళ్లీ ఎస్పారెస్పీ అధికారులతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన పోలీసులు, ఎస్సారెస్పీ భూమిలో మట్టి తవ్వకాలు చేస్తున్న మల్లయ్య కుటుంబ సభ్యులకే వత్తాసు పలికినట్టు ఐలుమల్లు, అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎవరికి ఫిర్యాదు చేసినా భూ ఆక్రమణ, మట్టి తవ్వకాలు ఆగడం లేదని, తాను అడ్డుకుంటే ఆక్రమ ణదారులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఐలుమల్లు శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా ఆయనను చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించినట్లు చెప్పారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోనీ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐలుమల్లు మధ్యాహ్నం మృతి చెందాడు. అయితే సీఐ పోలీసులు బెదిరించి తనను వేధించడం వల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు బాధితుడు కుటుంబ సభ్యులకు, మీడియాకు వివరించిన అనంతరం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసు వేధింపులతో ఐలమళ్ళు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐలుమల్లు మృతి పై కరీంనగర్ ఇంటలిజెన్స్ అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతూ పోలీసుల పాత్ర పై నివేదికను సీపీకి అందజేయనున్నట్లు తెలిసింది.


పోలీసుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి హనుమకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఐలుమల్లు