
– చెక్కులు ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం కేసీఆర్ శిష్యరికమా?
చెక్కుల విషయంలో ఇతర నియోజకవర్గాల్లో రాని సమస్య కౌశిక్ రెడ్డికి ఎందుకు వస్తుంది.
అర్హులైన వారికి దఫల వారిగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి లబ్ధిదారులకు అండగా ఉంటాం.
– పదేళ్లలో ఒక్క ఇళ్ళు కూడా నియోజకవర్గంలో ఇవ్వకుండా ఇప్పుడు ధర్నాలా?
– సోషల్ మీడియా మీద ఉన్న ప్రేమ హుజురాబాద్ ప్రజల సమస్యలపై లేదు.
– నేరచరిత్ర కలిగిన వ్యక్తి కౌశిక్ రెడ్డి
– స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..క్యాడర్ కు ప్రణవ్ సూచన.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలో చేసిన అభివృద్ధి బిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో సుమారు 150 సీఎం చెక్కులు అందజేయనున్నామని అందులో భాగంగా హుజురాబాద్ మండలంలో 16 లక్షలకు పైచిలుకు విలువగల 39 చెక్కులను పంపిణీ చేశామని, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ క్యాబినెట్లో ఆమోదించామని హుజురాబాద్ నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కమలాపూర్ మండలంలో గడువు ముగిసిన కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో కూడా ఇదేవిధంగా గడువు ముగిసిన చెక్కులను మరల రీవాలిడేషన్ చేసి ఇచ్చారని, ఏడు నెలల క్రితం చెక్కులను ప్రభుత్వం అందిస్తే ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని, ఇదేనా కేసీఆర్ శిష్యరికం అని ప్రశ్నించారు. అంతలా ఇబ్బంది ఉంటే చెక్కులు పంచకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేస్తారని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో అధికారులు వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోషల్ మీడియాలో రిల్స్ చేయడం మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 3500 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామని, దఫలవారీగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కేటాయిస్తామని, సాంకేతిక కారణాల వలన ఆగిన ఇళ్లను కూడా అందజేస్తామని, త్వరలో అసంపూర్తిగా నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం స్కాంములకు, అవినీతి బెదిరింపులతోనే కాలం వెల్లదీశారని అన్నారు. పదేళ్లలో ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వకుండా, రెండేళ్లు ఎమ్మెల్సీగా, విప్ గా ఉండి కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంచే సోయి కౌశిక్ రెడ్డికి లేక ఇప్పుడు ధర్నాలు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో సుమారు 3500 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని, అందుకే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని చెప్పారు. కౌశిక్ రెడ్డిపై కావాలని ఎవరు కేసులు పెట్టలేదని తాను చేసిన దౌర్జన్యాలతో పాటు తననడవడిక సరిగా లేదని కేసులు నమోదయాయని అన్నారు. నాపై కన్ను పెడితే ఏకే 47 గన్ అవుతానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారని, ఏకే 47 గన్ అయి ప్రజలను చంపుతారా అని ఆయన ప్రశ్నించారు?. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వరకు కౌశిక్ రెడ్డి ఆగడాలపై ఎన్నో కేసులు నమోదు అయ్యాయని, కౌశిక్ రెడ్డి చరిత్ర మొత్తం కేసులమయం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోకుంటే ఊళ్ళలో తిరగనివ్వమని హెచ్చరించారు. త్వరలో రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండల కేంద్రంలో చెక్కులు అందజేసిన ప్రణవ్..
ఇల్లందకుంట మండల కేంద్రంలో 17 మంది లబ్దిదారులకు 7 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తుందని, అర్హులైన అందరికి ఆదర్శమైన ప్రజాపాలన అందిస్తామని చెప్పారు.




లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రణవ్

లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రణవ్…




విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్….

ఇల్లందకుంటలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రణవ్..