
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
తెలుగు ప్రజల గుండెల్లో కోటా చిరస్థాయిగా ఉంటారు: సీఎం రేవంత్ రెడ్డి
కోటా శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని TG సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు’ అని పేర్కొన్నారు. మరోవైపు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి, శివాజీరాజా, అచ్చిరెడ్డి, రావు రమేశ్, తదితరులు కోటా భౌతిక కాయానికి నివాళులర్పించారు.
ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర: బాలకృష్ణ
కోట శ్రీనివాసరావు మృతిపట్ల బాలకృష్ణ సంతాపం తెలియజేశారు. 4దశాబ్దాల విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అన్నారు.
కోట శ్రీనివాస రావు మృతిపై KCR, KTR సంతాపం
కోట శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు అని కేసీఆర్ కొనియాడారు. సినిమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందంటూ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.


మృతి చెందిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు.. (ఫైల్)





