
– కాంగ్రెస్ సర్కార్ దళితులకు చేసిన మేలు శూన్యం…
– రెండో విడత దళిత బంధు మొత్తాన్ని ఎందుకు ఇవ్వడం లేదు…?.!మీ దళిత భరోసా ను కూడా అటకెక్కించారు.?
– బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో దాదాపు కోటి రూపాయల నిధులతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. మంగళవారం రోజున స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి హుజురాబాద్ దళిత కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ పట్టణంలో 2018లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తే, నేటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదన్నారు. 2023లో పనుల పూర్తి కోసం నిధులు కేటాయించిన తదనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల సమస్యలు పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. గత ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి మంగళం పాడిందని, ముఖ్యంగా హుజురాబాద్ లో రెండో విడత కింద ఇవ్వాల్సిన దళిత బంధు నిధులను నేటికీ ఇవ్వకుండా కాంగ్రెస్ దళితులకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గం నుండి చేపట్టిన దళిత బంధు పథకంలో రెండో విడత నిధుల విడుదల కోసం దళిత ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఉపాధి, బతుకుతెరువు కోసం గత ప్రభుత్వం దళిత బంధు కింద అందించిన మొదటి విడత మొత్తంతో లబ్ధిదారులు వ్యాపారాలు ప్రారంభించారని, అయితే చాలీచాలని మొత్తంతో వారంతా వ్యాపారాలు నెట్టుకు రావడం కష్టంగా మారిందని, అందుకే రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేసి ఆయా పథక లబ్ధిదారులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకం పేరు మార్చింది తప్ప ఏ ఒక్క దళితున్ని నేటికీ ఆర్థికంగా ఆదుకున్న పాపాన పోలేదని, వారికి ఏ రకంగా చేయూతనిచ్చిన దాఖలాలు లేవన్నారు. దళితుల ఆత్మగౌరవానికి ప్రతికగా నిలిచి, అన్ని విధాల ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడానికి కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే హుజురాబాద్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, యాళ్ల సంజీవరెడ్డి, కొడిమ్యాల పవన్, బోరగాల సారయ్య, మండల ప్రధాన కార్యదర్శులు కొండల్ రెడ్డి, మోడెపు వినయ్, భూత్ అధ్యక్షులు క్యాస వెంకటేష్, తాళ్లపెల్లి దేవేంద్ర, రాజేష్ ఖన్న, కొండల్ రెడ్డి, చత్తర్ సింగ్, మొలుగురి రాజు, గుర్రం సంతోష్ తాళ్లపల్లి హరీష్, సుధాకర్, తూర్పాటి రమేష్, అంబేద్కర్ సంఘ నాయకులు మరిపెల్లి శ్రీనివాస్, మల్లయ్య వేల్పుల ప్రభాకర్, బొడిగ మల్లయ్య, తునికి సమ్మయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



హుజురాబాద్ పట్టణంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన అంబేద్కర్ కమ్యూనిటీ హాలును పరిశీలించి కమిషనర్ సమ్మయ్య ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి..





