
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి భర్త కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డిఎస్పి జీదుల మహేష్ బాబు గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. శుక్రవారం హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులోనీ ఎసిపి క్యాంపు కార్యాలయంలో ఎసిపి మాధవితో ఉండగా మహేష్ కు గుండెపోటు రావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొని వచ్చారు. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి ఇతర వైద్యులు ఆయనకు సిపిఆర్ నిర్వహించారు. కానీ ఆయన చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందారు. తన భర్త చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏసిపి మాధవి కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో సేవలందిస్తున్న మహేష్, ఎస్సైగా పదవీ జీవితం ప్రారంభించి క్రమంగా సీఐ, అనంతరం డీఎస్పీగా పదోన్నతి పొందారు. క్రమశిక్షణ, ప్రజాప్రయోజనాలకు లోబడి పనిచేసిన ఆయన ‘ఫ్రెండ్లీ పోలీస్’గా పేరుగాంచారు.
ఆయన మృతితో కరీంనగర్ పోలీస్ శాఖలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఇతర అధికారులు డీఎస్పీ మహేష్ మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏసీపీ మాధవిని ఓదార్చారు. ఆదర్శ దంపతులుగా ప్రశంసలందుకున్న మాధవి-మహేష్ దంపతుల్లో చోటు చేసుకున్న ఈ అకాల మరణం పోలీస్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
– మహేష్ మృతి పట్ల పలువురు సంతాపం
1992 బ్యాచ్ కి చెందిన మహేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి ప్రణవ్ బాబు, సిఐలు టి కరుణాకర్, పులి వెంకట్ గౌడ్, తాసిల్దార్ కే కనకయ్య, కమిషనర్ కే సమ్మయ్య, స్వర్ణోదయం ప్రతినిధి మండల యాదగిరి, పలువురు పాత్రికేయులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా అంత్యక్రియల నిమిత్తం డి.ఎస్.పి మహేష్ బాబు మృతదేహాన్ని కరీంనగర్ కు తీసుకొని వెళ్లారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం
డిఎస్పీ మహేశ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు. పోలీస్ శాఖలో మహేశ్ చేసిన సేవలు మరువలేనియన్నారు. ఆయన మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మహేశ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు సంతాపం తెలిపారు. తన తండ్రి జగపతిరావుతో ఏసీపీ మహేశ్ కు మంచి సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం
డీఎస్పీ మహేష్ అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహేష్ బార్య ఏసిపి మాధవి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


మృతి చెందిన డి.ఎస్.పి మహేష్ బాబు (ఫైల్)

హుజురాబాద్ ఏసిపి మాధవితో ఆమె భర్త ఏసిపి మహేష్ బాబు (ఫైల్)

భర్త మహేష్ బాబు మృతదేహం పై పడి రోధిస్తున్న ఏసీపీ మాధవి..






