
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పెన్షనర్ల సమస్యల సాధన కొరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమన్వయ సమితి పిలుపుమేరకు ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణచారి మాట్లాడుతూ ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటివరకు చెల్లించకపోవడం, జూలై 2023 నుండి నూతన పిఆర్సి అమలు చేయకుండా ఐదు డీఏలను పెండింగ్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పెన్షనర్స్ ను మానసికంగా ఇబ్బందికి గురి చేయడం తప్ప మరొకటి కాదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అదేవిధంగా పెన్షనర్స్ కు ఈహెచ్ఎస్ స్కీమును అందుబాటులోకి తేవడం, తాము మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు పరచి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమన్వయ సమితి తమకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర రాజధానిలో ఈ నెల 11వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ప్రత్యక్ష కార్యాచరణ రూపంలో మహా ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి పెన్షనర్లందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.







