
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఆదివారం వానరాలు హల్ చల్ చేశాయి. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రతిరోజు వందలాదిమంది ప్రజలు వాకింగ్ చేస్తారు. ఆదివారం పాఠశాల మైదానంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్ పై ఒక్కసారిగా వందలాది గా వచ్చిన వానరాలు దాడికి దిగాయి. వానరాలు ఒక్కసారిగా వందలాదిగా రావడంతో భయాందోళనకు గురైన వాకర్స్ మైదానంలో పరుగులు పెట్టారు. ఆదివారం తెల్లవారు జామున వర్షం పడడంతో మైదానం అంతా నీటితో నిండిపోయింది. అప్పటివరకు చెట్లపై ఉన్న కోతులన్నీ వాకర్స్ మైదానం రావడంతో చెట్లు దిగి మైదానంలోని వాకర్స్ పైకి వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన వాకర్స్ వాటి భయంతో చాలామంది ఇళ్లకు వెళ్లిపోయారు. మైదానంలో వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో వందలాది వానరాలు నీటిలో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వారిని భయపెట్టాయి. పట్టణంలో ఎక్కడ చూసినా కోతుల బాధ వర్ణనాతీతం. గుంపులు గుంపులుగా వస్తు ఇండ్లపై దాడి చేస్తున్నాయి. ఎదురుగా ఏమైనా వస్తువులు ఉంటే అవి ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి తలుపులు తీసి ఉంటే లోపలికి వెళ్లి అందిన వస్తువులను తీసుకొని బయట వస్తున్నాయి. ఇంట్లో వారిని బెదిరిస్తున్నాయి. చాలామంది కోతుల దాడుల్లో గాయాల పాలవుతున్నారు. ఇటీవల రెవెన్యూ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేసే సుదర్శన్ అనే వ్యక్తి కోతుల వల్ల అయిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడన్న విషయం ప్రజలకు విధితమే. మున్సిపల్ అధికారులు వానరాల వల్ల ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు.







హై స్కూల్ క్రీడా మైదానంలో నిలిచిన నీటిలో ఈదుతూ వాకర్సును ఇబ్బందులకు గురి చేస్తున్న వానరాలు…





