Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం విద్యానగర్ కు చెందిన కొండపర్తి సమ్మయ్య(59) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల సమ్మయ్య తన వ్యక్తిగత పని నిమిత్తం మండలంలోని కాట్రపళ్లికి వెళ్లి వస్తుండగా హుజురాబాద్ శివారులో లారీ (AP 04TX6489 ) ఢీ కొట్టింది. గాయపడ్డ సమ్మయ్యను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి అక్కడి నుండి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సమ్మయ్య చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఆదిలాబాద్ కు చెందిన గైక్వాడ్ ప్రకాష్ నాగతవ్ అని అతనిపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు మృతుని కుమారుడు అశోక్ తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే సమ్మయ్య పట్టణంలోని వరంగల్ రోడ్ లో గల నాగేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసేవారు. ఆయన మృతి పట్ల నాగేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం, వెయిటర్ అసోసియేషన్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు.






