
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
సమాజాన్ని, సమాజంలో నివసించే ప్రజల ఆరోగ్యoపై ఎంతో ప్రభావాన్ని చూపే స్వచ్ఛ పరిరక్షణ ఉద్యమం సమాజానికి మేలుకొలుపు లాంటిదని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్వచ్ఛ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ‘ పర్యావరణ పరిరక్షణలో మనం అనుసరించాల్సిన వ్యూహాలు స్వచ్ఛ హుజురాబాద్ లో మన పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం బాలికల పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ మార్పు అనేది సమాజంలో సహజంగా రాదని మార్పు ఒక్కరితో ప్రారంభమై ఒక ఉద్యమంలా మారుతుందన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ప్రాంతాన్ని స్వచ్ఛ హుజురాబాద్ గా మార్చడానికి మున్సిపల్ అధికారులకు తోడుగా ప్రజలు సహకరించాలన్నారు. పరిసరాల పరి శుభ్రత అనేది జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలని అప్పుడే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మనం నివసించే మన ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోతే క్రిమి కీటకాల వల్ల వ్యాధులు ప్రబలి అనారోగ్యం బారిన పడతారని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన ఉండాలని అంతేకాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉన్నప్పుడే స్వచ్ఛ హుజురాబాద్ సాధ్యమవుతుందని అన్నారు. 100 రోజుల స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరగడానికి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దేశానికి దిశా నిర్దేశం చేసే రేపటి పౌరులైన విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన పెరగడం వల్ల రాబోయే తరంలో పరిసరాలు బాగుంటాయని పేర్కొన్నారు. పిల్లల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచి ఉద్దేశంతో గతంలో స్వచ్ఛ ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛత మన జీవితంలో ఒక భాగం కావాలని తద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. అనంతరం ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ…మానవుల అనేక చర్యల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క నాటి వాటిని సంరక్షిస్తే కుటుంబం, సమాజ పచ్చదనానికి బాటలు వేసినట్లు అవుతుందని అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి తిరుమల, మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, ట్రస్మా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు నాయకులు రవీందర్ రెడ్డి, కోటేశ్వరరావు, కిరణ్ కుమార్, రాజ్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, స్వామిరావు, సంజీవ్, మారుతి, శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



వ్యాసరచన పోటీలు రాస్తున్న విద్యార్థులను పరిశీలిస్తున్న కమిషనర్ సమ్మయ్య…


పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న అతిథులు…

మొక్కలు నాటుతున్న కమిషనర్, ఉపాధ్యాయులు, తదితరులు..





