Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సోమవారం ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, అనవసర టార్గెట్లు పెట్టి ఒత్తిడి చేస్తున్నారని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలుగా ప్రజలకు సేవలందించాల్సిన తమపై పరిపాలనాపరమైన, సాంకేతికపరమైన పని భారాన్ని మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 32 రకాల మొబైల్ యాప్‌లలో ఆన్లైన్ డేటా నమోదు చేయాల్సిన ఒత్తిడితో తమ పనిభారం మరింత పెరిగిందని వారు తెలిపారు. లేని గర్భిణీ స్త్రీల వివరాలను కూడా నమోదు చేయాలని టార్గెట్లు ఇస్తున్నారని, దీని వల్ల తాము మానసికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. అంతేకాకుండా ఒకసారి పూర్తి చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయమంటున్నారని, ఇప్పటికే సమర్పించిన రిపోర్టులను తిరిగి అడుగుతున్నారని ఏఎన్ఎంలు పేర్కొన్నారు. దీనివల్ల సమయం వృథా అవుతుందని, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఆన్లైన్ వర్కులను తమతో చేయించడాన్ని వెంటనే నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో శారద, సరోజన, వజ్ర, కరుణ, శోభ, అబిద, సౌందర్య, రేణుక, పద్మ, కవిత, శ్రీదేవి, రాజశ్రీ, సుభద్ర, సునీత, వనిత, జయ, జీనథ్, సైదా, సుమలత, వసంత తదితర ఎఎన్ఎంలు పాల్గొన్నారు.






