
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మీరు జీతాలు తీసుకొని డ్యూటీ చేస్తున్నారా.. ఇంట్లో పడుకుంటున్నారా..! వైన్ షాపులో అంగన్ వాడి గుడ్లు దొరకడంతో జిల్లా పరువు రాష్ట్రవ్యాప్తంగా పోయిందని డీడబ్ల్యువో సరస్వతి హుజురాబాద్ ఐసిడిఎస్ అధికారులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ దానికి తగ్గట్టుగా పని చేయాలి కానీ ఆఫీసులోనే కూర్చుంటే ఎలా అంటూ మందలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చిన్న పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం అంగన్వాడీ కోడిగుడ్లు పక్కదారి పట్టాయనీ, అవి మందు బాబులకు పౌష్టికాహారంగా మారడంపై పత్రికలు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు డిడబ్ల్యూఓ సరస్వతిని ఆదేశించారు. దీంతో ఆమె శనివారం హుజురాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో గల రేణుక ఎల్లమ్మ వైన్స్ పక్కన పర్మిట్ రూమ్ లో మందు బాబులకు అంగన్వాడి గుడ్లు ఆహారంగా మారిన దానిపై విచారణ జరిపారు. ముందుగా ఆమె హుజరాబాద్ సిడిపిఓ సుగుణ సూపర్వైజర్లపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన కోడిగుడ్లు అంగన్వాడీ కేంద్రము నుండి వైన్ షాప్ పర్మిట్ రూమ్ ఓనరుకు చేరిన విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీశారు. మనుమలకు మండలంలోని రంగాపూర్ అంగన్వాడి సెంటర్లో ఇచ్చిన గుడ్లను గత మూడు నెలలుగా తినకుండా పైసలకు కక్కుర్తి పడి అంగన్వాడి గుడ్లను ఏకంగా విక్రయానికి పెట్టడంపై సదరు వ్యక్తి వెంకటేశ్వర్లు మందలించారు. హోటల్లో అంగన్వాడి గుడ్లు పెట్టారని పాత్రికేయులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోకాపోవడంతో ఐసిడిఎస్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేషాలమేరకు సందర్శించి సమగ్ర విచారణ జరపడం జరుగుతుందని పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ కు నివేదిక రూపంలో అందజేస్తామని డిడబ్ల్యుఓ తెలిపారు. కరీంనగర్ రోడ్డు నుండి నేరుగా రంగాపూర్ సెంటర్ కు వెళ్లి అక్కడ కూడా విచారణ జరిపారు. లబ్ధిదారులకు ఇచ్చిన గుడ్లు తప్ప తాము ఎవ్వరికి విక్రయించలేదని స్థానిక అంగన్వాడీ టీచర్ విచారణలో తెలిపారు. కాగా అంగన్వాడి గుడ్లు విక్రయించిన వెంకటేశ్వర్లు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణకు తీసుకువెళ్లారు. ఈ విచారణలో సిడిపిఓ సుగుణ, సూపర్వైజర్లు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.



పర్మిట్ రూములో అంగన్వాడి గుడ్లు విక్రయించడంపై నిర్వాకుడు వెంకటేశ్వర్లను మందలిస్తున్న డిడబ్ల్యువో సరస్వతి…



అంగన్వాడి సెంటర్లో ఉండాల్సిన కోడిగుడ్ల ట్రే లు పర్మిట్ రూంలో దర్శనం ఇవ్వడంతో కంగుతున్న అధికారులు…





