
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ పల్లెల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషాలతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మ పండుగ మొదటిరోజున ఎంగిలిపూల బతుకమ్మగా జరుపుకోవడం అనావాయితీ. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మహిళలు సాయంత్రం బతుకమ్మలను తలపై పెట్టుకుని పట్టణంలోని శివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ బతుకమ్మ ల చుట్టూ బతుకమ్మ…. బతుకమ్మ…. ఉయ్యాలో…. బంగారు బతుకమ్మ ఉయ్యాలో… అంటూ లయబద్ధంగా చేతులతో కొడుతూ పాటలు పాడుతూ ఆడుకున్నారు. అనంతరం గౌరమ్మ తల్లిని తమ కుటుంబాన్ని, మాంగల్యాన్ని చల్లగా చూడాలని దుర్గాదేవిని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య బతుకమ్మల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 ప్రాంతాల వద్ద మహిళలు బతుకమ్మ లు ఆడుకోవడానికి తగిన ఏర్పాట్లను చేశారు. శివాలయం వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. విద్యానగర్ లో, సిద్ధార్థ నగర్, కొత్తపల్లి నాగేంద్ర స్వామి టెంపుల్ వద్ద, ఇందిరానగర్ భూలక్ష్మి వద్ద, ఇప్పల నర్సింగాపూర్ కెనాల్ పక్కన, దమ్మక్కపేట పాత గ్రామపంచాయతీ వద్ద, కెసి క్యాంపులో బతుకమ్మల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కాగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్ ఆధ్వర్యంలో చేశారు. కాగా 26 వార్డులోనీ వెంకటేశ్వర టాకీస్ లో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో భాగంగా మొదటి రోజు డ్రాలో చల్లూరి కమలమ్మ బహుమతిగా చీరను గెలుచుకుంది. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యల చేతుల మీదుగా అందచేశారు. కమిషనర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు పురుషులతో కలిసి కోలాటం ఆటలు ఆడి ఆకట్టుకున్నారు.











హనుమాన్ టెంపుల్ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కమిషనర్ సమ్మయ్య..






