
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోనీ ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి గుడ్డు రట్టు చేసి పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రోడ్డు లోని బాలాజీ ట్రేడర్స్ అనే రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 238.40 క్వింటాళ్ల ప్రభుత్వ(పిడిఎస్) రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడీఏస్) బియ్యం పక్కదారి పట్టి, అక్రమంగా నిల్వ ఉంచుతున్నారనే సమాచారం మేరకు జిల్లా విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 238.40 క్వింటాళ్ల బియ్యం నిల్వలను గుర్తించి, పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. అనంతరం, విజిలెన్స్ అధికారులు పట్టుకున్న ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి, సీజ్ చేసిన ఈ రేషన్ బియ్యాన్ని హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో ఉన్న మండల్ లెవల్ స్టాకింగ్ పాయింట్ (ఎంఎల్ ఎస్ పాయింట్) కు తరలించారు. అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారిపై పౌరసరఫరాల చట్టం 6 ఏ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. దాడిలో జిల్లా విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులతో పాటు స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదు చేస్తేనే..!
హుజురాబాద్ కేంద్రంగా గత కొన్ని ఏళ్లుగా అక్రమ రేషన్ బియ్యం దందా యదేచ్చగా కొనసాగుతుండగా సంబంధిత సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గురువారం పట్టుకున్న రేషన్ బియ్యం సైతం అదేవిధంగా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తేనే దాడి నిర్వహించి రేషన్ బియ్యం పట్టుకున్నట్లు అధికారులే స్వయంగా ప్రకటించారు. అంటే దీన్నిబట్టి చూస్తే రేషన్ బియ్యం దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులు అంతా ‘మామూలు’లే అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అక్రమ రేషన్ బియ్యంపై ఉక్కు పాదం మోపి అక్రమ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్న అధికారుల పై శాఖ పరమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని పలువురు సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.








