
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ట్రాక్టర్లు నడిరోడ్డుపై ఏలాంటి ట్రాఫిక్ ప్రమాద హెచ్చరికలు లేకుండా నిలిపి ఉంచడంతో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాక్టర్ కు ఢీ కొట్టి తీవ్రగాయాలతో మృతి చెందిన సంఘటన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జమ్మికుంట ప్రధాన రహదారిలోని రోడ్డు డివైడర్లలో ఉన్న పూల మొక్కలకు ఎర్రమట్టి పోసేందుకు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రాక్టర్ ను రోడ్డుపై నిలిపి ఎలాంటి పార్కింగ్ లైట్లు వేయడం గాని ప్రమాద హెచ్చరికలు గాని పెట్టకుండా నిలిపి ఉంచడంతో వేగంగా వెనుక నుంచి ట్రాలీ ఆటోను ఓవర్టేక్ చేసే క్రమంలో హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేముల అక్షయ్ సాయి (18) అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడ్డాడు. అతడు కరీంనగర్ పట్టణంలోని వాగేశ్వరి కళాశాలలో బిఎస్ సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. అయితే మండలంలోని రంగాపూర్ వద్ద ఉన్న తన స్నేహితుడిని ప్రతి రోజు బైకుపై తీసుకునీ వచ్చి తన బైకును బస్టాండ్ ల పెట్టి చదువుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఇద్దరు కలిసి కరీంనగర్ కు వెళ్లేవారు. అందులో భాగంగా తన పల్సర్ బైక్ పై హుజురాబాద్ నుంచి రంగాపూర్ గ్రామానికి వెళ్తున్నాడు. అటో ట్రాలీనీ దాటేస్తున్న క్రమం లో రోడ్డు పై నిర్లక్ష్యంగా నిలిపి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్ ను వెనకనుంచి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అక్షయ్ సాయికి తలకు, చాతి బొక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన అక్షయ్ సాయిని హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అక్షయ్ సాయి మరణించినట్లు తెలిపారు. అక్షయ్ సాయి చదువుకుంటూనే రాత్రి వేళలో పెట్రోల్ బంకులో పనిచేస్తూ పైసా పైసా కుప్ప చేసుకుని పల్సర్ బైక్ ఇటీవలనే కొనుగోలు చేసుకున్నట్లు తెలిసింది. తండ్రి వేముల రాజు వెల్డింగ్ షాప్ ల వర్కర్ గా పనిచేస్తుండగా అతనికి ఇద్దరు కుమారులు కాగా చిన్నవాడు అక్షయ్ సాయి. ఆ విద్యార్థి మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ట్రాక్టర్ ను ప్రధాన రహదారిపై నిలిపేటప్పుడు సరైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు మిత్రులు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యపు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



మున్సిపల్ ట్రాక్టర్ ను ఢీకొని నడిరోడ్డుపై తీవ్రగాయాలతో పడిన వేముల అక్షయ్ సాయి..

ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన అక్షయ సాయి..





