
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 110 మంది గురుకులాలలో చదివే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పిల్లల ఉసురు తాకుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని రాంపూర్ గ్రామంలో ఇటీవల వంగర గురుకుల బాలికల పాఠశాలలో చదివే శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడగా ఆమె కుటుంబాన్ని కవిత సందర్శించి పరామర్శించారు. శ్రీ వర్షిత చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్షిత తల్లిదండ్రులను ఆమె ఓదార్చి శ్రీ వర్షిత ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..రాష్ట్రంలో ప్రభుత్వ చేతకానితనం వల్ల గురుకులాల్లో చదివే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కానీ ప్రతిపక్షాలపై, ప్రత్యర్థులపై సిట్ వేసే ప్రభుత్వం ఆత్మహత్యకు పాల్పడిన శ్రీ వర్షిత మృతిపై సిట్ వేసి ఆమె ఆత్మహత్య పై నిజా నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత చదువులో మొదటి ర్యాంకులో ఉన్నప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పకపోవడం దారుణమని అన్నారు. తల్లిదండ్రులకు అమ్మాయి ఫోన్ చేసిన గంటలోగానే ఆత్మహత్యకు పాల్పడడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని అన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడడం ఆమె తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలిందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంలోని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఇప్పటివరకు విచారణ చేపట్టకపోవడం దారుణమని అన్నారు. గురుకులాల్లో చదివే పిల్లలు ఎందుకు చని పోతున్నారో తెలుసుకునే అవసరం ప్రభుత్వానికి లేదా…? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థి మృతి పట్ల విచారణ జరపకుండా కుటుంబానికి న్యాయం చేయకపోతే తెలంగాణ జాగృతి స్పందించి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి పిల్లల ఆత్మహత్యల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, రూప్ సింగ్, పాకనాటి మంజుల తదితరులు పాల్గొన్నారు


మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కవిత

శ్రీ వర్షిత చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పిస్తున్న కవిత

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత





