
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
మొంతా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నియోజకవర్గంలోని హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షానికి పంట నష్టం జరిగిన గ్రామాల్లో కౌశిక్ రెడ్డి సందర్శించి రైతులను ఓదార్చారు. అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంటే… కన్నీళ్లు తూడువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం అనడం రైతులపై ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనాలు ఉన్నాయని అన్నారు.
అధికారులు మాత్రం ప్రభుత్వానికి మాత్రం నియోజకవర్గంలో 825 ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని నివేదికలు అందించడం దారుణమని అన్నారు. తుఫాను ప్రభావానికి హుజురాబాద్ నియోజకవర్గం లో 30 వేలకు పైగా ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం జరిగిందని అన్నారు. గ్రామాల్లో పరిశీలనకు వెళ్తే అన్నదాతలు రోదిస్తున్న తీరు చూసి ఎమ్మెల్యే కలత చెంది ఓదార్చారు.
ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుఫాను కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని నష్ట నివారణ కింద ప్రతి రైతుకు ఎకరాకు వరి పంటకు 25000, పత్తి పంటకు రూ.50,000 నష్టపరిహారం ప్రకటించాలని హుజురాబాద్ ఎమ్మెల్యేగా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. గ్రామాల్లో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తప్ప మిగిలిందేవీ లేవని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నేలరాలిన పంట చేలలను చూసి రైతన్నలు విలవిలలాడుతూ కాంగ్రెస్ నాయకులు కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారం రూ. 10,000 ప్రకటించడం భావ్యం కాదని అన్నారు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు వర్షం కారణంగా ఆరు నెలల కష్టం బూడిద పాలు అయిందని ప్రభుత్వం కనీసం మానవత్వంగా అన్నదాతలను తక్షణసాయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు నామమాత్రంగా నివేదికలు తయారు చేయకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన ప్రతి గ్రామంలో క్షేత్ర పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు ఉన్నతాధికారులకు ప్రభుత్వాలకు నివేదించాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన పట్ట నష్టం పై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణితో ఉంటే రైతులందరితో కలిసి పంట నష్టం జరిగిన ప్రాంతాలను ఎమ్మెల్యేగా నేనే పరిశీలన చేస్తానని అధికారులు తన వెంట రావాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాలలో ప్రతి రైతు కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యేగా నేను వారందరికీ భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందనే విషయం మర్చిపోవద్దని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ప్రతి రైతుకు ఇప్పటివరకు బాకీ పడ్డ రైతు భరోసా బోనస్ లాంటి వాటిని వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రతి కౌలు రైతుకు ఇప్పటివరకు 76 వేల రూపాయలు, రుణమాఫీ రెండు లక్షలు, సన్న వడ్లకు బోనస్ క్వింటాకు 500 చొప్పున 50 వేల రూపాయల ప్రతి రైతుకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించి చిత్తశుద్ధి చాటుకోవాలని కౌశిక్ రెడ్డి తెలిపారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12000 చెల్లిస్తామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఎమ్మెల్యేగా నేను రైతు కూలీల పక్షాన డిమాండ్ చేస్తున్నాను అన్నారు. నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి ఇప్పటివరకు రెండు లక్షలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు డబ్బులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 ఇస్తానని పేర్కొన్న ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు రెండు రూపాయలు కూడా చెల్లించకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సహచర ఎమ్మెల్యేలతో ఆటోవాలా కు సంఘీభావంగా అసెంబ్లీలో నిరసన తెలిపిన ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా అనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని లేనియెడల కాంగ్రెస్ నాయకులను శ్రేణులను గ్రామాల్లో తిరుగనీయమని హెచ్చరించారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా..పేదలను గాలికి వదిలేసినారా, న్యాయం చేయరా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే బాకీ కార్డులతో మీ బతుకులను బజారులో ఎండ కడతాం తస్మాత్ జాగ్రత్త అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా హుజురాబాద్ లోను రాష్ట్రంలోనూ నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని కౌశిక్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను, తిరిగే సమయాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీయాలని అన్నారు. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని అప్పుడే కాంగ్రెస్ నాయకులకు జ్ఞానోదయం అవుతుందని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండల్ రెడ్డి, ఈ శ్యామ్ సుందర్ రెడ్డి, నాయకులు కొలిపాక శ్రీనివాస్, గందె శ్రీనివాస్, ఇరుమల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





అకాల వర్షాలకు నష్టపోయిన వరి పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.







