
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సన్న రకం వరి ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి నేటికీ బోనస్ వెయ్యక రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సోమవారం హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు కాసనగోని కిరణ్, తొగరు బిక్షపతిలు మాట్లాడుతూ… ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలను తమ వైపు తిప్పు కోవడానికి లెక్కలేనన్ని వాగ్దానాలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం లేదనీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేస్తున్నదన్నారు. గత సంవత్సరం పంటకు ఇప్పటివరకు 500 రూపాయల బోనస్ ఇవ్వలేదనీ అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బిఆర్ఎస్ రైతుల పక్షాన అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. రైతుబంధు పథకం కూడా సక్రమంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతు బీమాకు సంబంధించి ఎల్ఐసికి బీమా కట్టాలనీ, మొన్న వచ్చినటువంటి మోoతా తుఫానుకు పక్క రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా వారి నిర్లక్ష్యం మూలంగాను రైతులందరికీ ఒక ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..





