
– పేదల పొట్ట కొట్టే ప్రభుత్వ చర్యలను వెనక్కి తీసుకోవాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:కేవైసీ డిజిటలైజేషన్ పేరుతో 27 లక్షల మంది కూలీలను తొలగించడం గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడవటమే, ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడానికి గ్రామాలలో ఉద్యమాన్ని చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు పిలుపునిచ్చారు.
మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ మౌలిక చట్టానికి కొర్రీలు పెడుతూ కూలీలకు 100 పని పెట్టే బాధ్యతనుండి తప్పుకో చూస్తున్నదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నేషనల్ మొబైల్ మోనిటర్ రింగ్ సిస్టం తీసుకొచ్చి ఆధార్ కార్డు ఉపాధి జాబ్ కార్డు బ్యాంకు ఎకౌంటు లింకు పేరుతో పేర్లు సరిగా లేవని 7.8 లక్షల జాబు కార్డులను తొలగించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకులను క్లబ్ పేరుతో మూసివేశారనీ, ఆధార్ కార్డులు కూడా చాలామందికి జనరేట్ కాలేదు అన్నారు. వచ్చిన కార్డులలో పేర్లు తప్పులు సరి చేసుకోవడానికి ఆధార్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వంటి వాటి గురించి ప్రభుత్వం మాట్లాడటం లేదు అన్నారు. పని ప్రదేశంలో రెండుసార్లు ఫోటోలు ఉదయం సాయంత్రం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన తెచ్చింది కానీ ఆచరణలో అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు అని గుర్తు చేశారు. ఉపాధి సిబ్బందికి కంప్యూటర్ నెట్ సౌకర్యం వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు అని, ఫలితంగా పనికి వచ్చినా కూలీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం వలన కూలీలు పనికి రావడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. చేసిన పనికి వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని చట్టం చెప్తుంటే సంవత్సరాల తరబడి వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు. వేతనాలు కూడా 30, 50 రూపాయల లోపు మాత్రమే పడుతున్నాయనీ, ఫలితంగా ఉపాధి పనికి పోతే వేతనాలు పడవు, రావు అనే ఒక ఆభద్రత భావం ప్రజల్లో పెరిగిందన్నారు. పనులను పరిశీలన చేయడానికి డ్రోన్ యంత్రాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. డ్రోన్ సాయంతో ఫోటోలు తీస్తూనే మరొకవైపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పటం ఆందోళన కలిగించే అంశం. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాకపోవడంతో దొడ్డి దారిన బలహీనపరిచే కుట్ర చేస్తున్నదనీ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు వందరోజుల పనిని ప్రభుత్వం కల్పించాలని నిబంధనను నేరుగార్చడం కోసమే దొడ్డిదారిన ప్రభుత్వం కొత్త నిబంధనలను ముందుకు తెస్తున్నదన్నారు. పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులో కోత విధించిందనీ, గ్రామీణ పేదలు రైతాంగానికి ఉపయోగపడే పనులను ఎంపిక చేయకుండా ఎత్తివేసిందన్నారు. వ్యవసాయ పొలాల అభివృద్ధి పనులను వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధికి ఉపయోగపడే పనులను తీసివేసిందన్నారు. అభివృద్ధి పేరుతో అనేక గ్రామాలను పట్టణాలలో కలిపి పనిని తీసివేసిందనీ, తక్షణమే ఈ ఆలోచన నుండి ప్రభుత్వం వెనక్కి రావాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్త ప్రతిఘటనను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు





