
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగింది. ఎన్నాళ్లుగానో గ్రామాల్లో ఆశావాహులు ఎదురు చూసిన గ్రామపంచాయతీ పోలింగ్ షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల కోడ్ అమలుకి రావడంతో పాటు ఒక్కసారిగా రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే ఆశావాహుల సందడి గ్రామాలలో ఇప్పటికే మొదలై పల్లెలల్లో పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో నిర్వహించనున్నది.
మొదటి విడత – డిసెంబర్ 11
రెండో విడత – డిసెంబర్ 14
మూడో విడత – డిసెంబర్ 17
అదే రోజు పల్లెల్లో ప్రజాస్వామ్య పండుగ జరగనుంది. ప్రతి గ్రామంలో ప్రచార తంతు మోత మొదలై అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
సర్పంచ్, వార్డ్ సభ్యుల పదవుల కోసం పోటీ మరింత హోరాహోరీగా మారనుంది. ముఖ్యంగా పలు గ్రామాల్లో స్థానిక రాజకీయ సమీకరణాలు ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. యువత, మహిళలు కూడా భారీ సంఖ్యలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

అధికారుల ఏర్పాట్లు వేగవంతం..
పోలింగ్ నిర్వహణకు సంబంధించి జిల్లా, మండల అధికారులు సమావేశాలు ప్రారంభించారు. సిబ్బంది నియామకాలు, పోలింగ్ కేంద్రాల సన్నాహాలు, భద్రతా చర్యలు, సామాగ్రి పంపిణీ వంటి అంశాలపై చురుకైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రజాస్వామ్య పండుగకు సిద్ధం అవుతున్న పల్లెలు
ఈ ఎన్నికలు స్థానిక పాలన, గ్రామాభివృద్ధిలో కీలక ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రజలు కూడా ఉత్సాహంగా బరిలోకి దిగే అభ్యర్థులను పరిశీలిస్తూ చర్చలు ముమ్మరం చేస్తున్నారు.


కరీంనగర్ జిల్లాలో మొదటి విడతగా.. గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాల్లో పోలింగ్ జరగనుండగా,
రెండో విడతలో.. చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే మూడో విడతలో.. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆశావాహులు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకోగా, ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి పట్టు సాధించాలని అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ, బిజెపి, తదితర పార్టీలు బరిలోకి దిగనున్నాయి.





