Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నల్గొండ జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరిపై అగ్రవర్ణ కులానికి చెందిన సందీప్ రెడ్డి అమానుష దాడికి వ్యతిరేకంగా ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి దాడిని ఖండించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అగ్రవర్ణాల ఆగడాలు రోజురోజుకు శృతి మించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగలక్ష్మి తమ స్వగ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా ఆమె భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన సందీప్ రెడ్డిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల ఆగడాలని ఎదుర్కోవడానికి రాష్ట్రములోని బలహీన వర్గాలకు చెందిన బిడ్డలందరూ ఏకమై సందీప్ రెడ్డిని కఠినంగా శిక్షించేంతవరకు బీసీ వర్గాలు తమ పోరాటాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, వడ్నాల ప్రభాకర్, కామనీ సమ్మయ్య న్యాయవాది, ఆళ్ళ కేశవులు, మాడుగుల ఓదెలు, రామ్ సారయ్య, మధుకర్, కందుల రవీందర్ గౌడ్, శ్రీకాంత్, టి శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ ముదిరాజ్, సిహెచ్ సురేష్, కె క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బీసీ జేఏసి నాయకులు..





