
– కరీంనగర్ డీసిసి అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు.
– కార్యకర్తల ఉత్సాహం మధ్య ఘనంగా స్వాగత ర్యాలీ..
– హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదనీ,కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ లో నూతనంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన చొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ప్రమాణస్వీకార కార్యక్రమం కార్యకర్తల కోలాహలల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేశం,సుడా చైర్మెన్ నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, బీసీ,ఎస్సీ,ఎస్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తుందని, గతంలో పని చేసిన డీసిసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బాగా పనిచేశారని, రాబోయే రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి పదవులు ఇవ్వాలని కోరారు. నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని, మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామని అన్నారు.


కండువా కప్పి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రణవ్


సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..





