
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తనకు రాజకీయ జన్మనిచ్చిన హుజురాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవలందించిన వారు కొంతమంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారని, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న వారిని కాపాడుకుంటానని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిఆర్ ఎస్, బిజెపిలు కుమ్ముక్కు రాజకీయాలు చేశాయని ఈ కుట్ర వల్ల పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. నియోజకవర్గంలోని 107 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందని బిజెపి ఎంపీ బండి సంజయ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సొంతంగా 30 సర్పంచుల ను గెలుచుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నిధులు అందిస్తుందని అన్నారు.
–ఎమ్మెల్సీ నిధులు హుజురాబాద్ కే…
తనకు రాజకీయ జన్మనిచ్చిన హుజురాబాద్ ప్రాంత రుణం తీర్చుకోవడానికి తన ఎమ్మెల్సీ నిధుల నుండి 80 శాతం నిధులను హుజురాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం కేటాయిస్తానని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంత ప్రజల వైద్య అవసరాల కోసం సీఎంఆర్ ఎఫ్ పనులు నిర్వర్తించడానికి ఇక్కడ ఒక వ్యక్తిని నియమించి సేవలందిస్తానని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, ఇటీవల కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేసి గెలిచిన వారంతా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల సర్పంచులుగా గెలుపొందిన పలువురు సర్పంచులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బల్మూర్ వెంకట్ కు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.



హుజురాబాద్ లో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కు ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు…





