
– జనవరి 11న లక్ష మంది తో హనుమకొండ లో రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి….
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి ఐకాస నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ లోని పద్మనాయక వేడుకల మందిరంలో వరంగల్ లో నిర్వహించే ఓసిల సింహగర్జన సభ ఏర్పాట్లపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో పోలాడి రామారావుతో పాటు పలువురు ఐకాస రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు మాట్లాడారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10 లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని, ఓసి వర్గాలవారికి జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించే ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి సామాజిక వర్గీయులు రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలి వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 25 వేల మందిని సింహగర్జన సభకు తరలిస్తామని సమావేశంలో తీర్మానించినట్లు ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఓసి ఐకాస జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, రాష్ట్ర నాయకులు ఉట్కూరి రాధాకృష్ణరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి గండ్ర సంపత్ రావు, ఆర్య వైశ్య సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కన్న కృష్ణ, బ్రాహ్మణ సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్త కొండ రవీందర్ రావు, నాయకులు అండెం రమణారెడ్డి, జిల్లాల అంజయ్య, బోయినపల్లి గీత, కొమురవెల్లి వెంకటేశం, మల్యాల రమణయ్యతో పాటు ఓసి ఐకాస రాష్ర్ట నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐకాస నాయకులు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు


బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరిస్తున్న ఓసీ సంఘాల నాయకులు





