
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టిసిటిఎన్జీవోస్) టీఎన్జీవోస్ సంఘంతో అన్నతమ్ముల్లా అనుబంధంగా కొనసాగుతోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడించారు. సోమవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2001 సంవత్సరం నుండి ఈ రోజు వరకు టీఎన్జీవోస్ సంఘం ఇచ్చిన ప్రతి పిలుపును కట్టుబడి అమలు చేస్తూ, ప్రతి ఉద్యమంలో, ప్రతి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ముందువరుసలో నిలిచారని తెలిపారు.
టీఎన్జీవోస్ అడుగుజాడల్లోనే టిసిటిఎన్జీవోస్ సంఘం నడుస్తోందని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి డివిజన్లో టీఎన్జీవోస్తో సమానంగా కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. టిసిటిఎన్జీవోస్ నిర్వహించే ఏ కార్యక్రమమైనా తప్పనిసరిగా టీఎన్జీవోస్ రాష్ట్ర నాయకులను ఆహ్వానించి గౌరవించే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సుధాకర్ స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, కారం రవీందర్ రెడ్డి తదితరులతో పాటు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్‌ను ఘనంగా సన్మానించామని గుర్తు చేశారు.
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రతిసారి టీఎన్జీవోస్ దృష్టికి తీసుకెళ్తామని, వారు కూడా సమయం కేటాయించి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. టీఎన్జీవోస్, టిసిటిఎన్జీవోస్ సంఘాలు తెలంగాణలో పరస్పర గౌరవంతో కలిసిమెలిసి కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇటీవల టిసిటిఎన్జీవోస్ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా టీఎన్జీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముజీబ్‌లను భారీగా సన్మానించడం కూడా సంఘం ఐక్యతకు నిదర్శనమని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.


రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్‌ను ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్


నూతనంగా ఎన్నికైన సందర్భంగా టీఎన్జీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ముజీబ్‌లను భారీగా సన్మానిస్తున్న మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





