
– జనవరి 11న లక్ష మందితో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హుస్నాబాద్): రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని , దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐలినేని మల్లిఖార్జునరెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లపై లోహస్నాబాద్ లో శనివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఓసి ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసిలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, మొన్నటి స్ధానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని పోలాడి రామారావు విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల తో ఓసి లకు నేటికీ తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకే రాజకీయ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఓసిలకు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రచార సామగ్రిని సమావేశంలో నిర్వాహకులకు అందజేశారు. నాయకులు రేమిడి వెంకట్ రాంరెడ్డి, రవీందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, పాండు రంగం, తిరుపతిలతో పాటు హుస్నాబాద్ డివిజన్ ఓసి ఐకాస నాయకులు పాల్గొన్నారు.

నినాదిస్తున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐలినేని మల్లిఖార్జునరెడ్డి

ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రచార సామగ్రిని సమావేశంలో నిర్వాహకులకు అందజేస్తున్న పోలాడి రామారావు





