
– ఎయిర్ పోర్ట్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తాం
ప్రత్యేక భవన సముదాయాన్ని నిర్మించి అద్దె కుటుంబాల బాధలను తొలగిస్తాం
నాయిని చెరువును పర్యాటక ప్రాంతంగా అభివ్రుద్ది చేస్తాం
జమ్మికుంట కాలేజీ స్టేడియానికి రూ.6.5 కోట్లు నిధుల మంజూరయ్యాయి
అతి త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదు…
కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివ్రుద్ధి సాధ్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
– జమ్మికుంట డిగ్రీ కాలేజీలో సింథటిక్ స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి
అధికారులు, కాలేజీ సిబ్బందితో సమావేశమైన బండి సంజయ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే… అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. రాష్ట్రంలో, ఆయా మున్సిపాలిటీలల్లో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ.. కేంద్రం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అనేక అభివ్రుద్ది పనులు చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమ్రుత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో ఆధునీకరించబోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి రూ.6.5 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఆర్డీవో రమేష్ బాబు, తహిసిల్దార్ తో కలిసి కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సూచనలను తీసుకున్నారు. కాలేజీలోని కొంత స్థలం కబ్జాకు గురైందని, ఆ స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్షారెడ్డి, స్థానిక నేతలు ఆకుల రాజేందర్, రఘ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

*జమ్మికుంటలో స్టేడియం నిర్మించాలని గతంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయను కలిసి ఆ ప్రతిపాదనలు అందజేశారు. రూ.6.50 కోట్లు మంజూరు చేశారు. అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చి స్టేడియం నిర్మిస్తాం. మోదీ ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మోదీ ప్రభుత్వం కాగితాలకే పరిమితం కాదు. వెంటనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభిస్తాం. అట్లాగే కాలేజీకి సంబంధించి కొంత స్థలాన్ని కబ్జా చేశారని ఫిర్యాదులు వచ్చాయి. కబ్జాలకు నేను పూర్తి వ్యతిరేకం. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల స్థలాల జోలికి వస్తే ఉక్కుపాదం మోపుతాం. గతంలో కరీంనగర్ లో ఇలాగే కొందరు చేస్తే పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీకు తెలుసు. జమ్మికుంటలోనూ కబ్జాలపై చర్యలు తప్పువు. ప్రభుత్వ కాలేజీ స్థలాన్ని కాపాడతా.

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఛైర్మన్ బీజేపీ కాదు. రాష్ట్రంలో అధికారంలో లేము. అయినా కేంద్ర మంత్రిగా జమ్మికుంటతోపాటు హుజూరాబాద్ నియోజకవర్గ అభివ్రుద్దికి పూర్తిస్థాయిలో క్రుషి చేస్తున్నా. ఇటీవల జమ్మికుంటతోపాటు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందజేసినం. వీటితోపాటు నియోజకవర్గంలో అనేక కుల సంఘాలకు, గుడి కోసం, బడి కోసం నిధులిచ్చాం. ఈజీఎస్ పేరుతో అనేక అభివ్రుద్ధి పనులు చేపట్టినం. జమ్మికుంట పేరుకే మున్సిపాలిటీ.. కానీ అభివ్రుద్ధి లేదు. వర్షాలొస్తే మునిగిపోయే కాలనీలు చాలా ఉన్నాయి. అభివ్రుద్ధికి సహకరించే వారు లేరు. ప్రతిపాదనలు పంపే వారు కూడా లేని పరిస్థితి. అందుకే కోరుతున్నా.. జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించండి. అభివ్రుద్ధి అంటే ఏమిటో చూపిస్తా.

మీవల్లే నేను ఎంపీగా గెలిచినం. మోదీ నన్ను కేంద్ర మంత్రిని చేశారు. ఈ పదవి ద్వారా కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా. కరీంనగర్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమ్రుత్ పథకంలో చేర్చి ఎయిర్ పోర్టు తరహాలో తీర్చిదిద్దుతా.
జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే… నాయిని చెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తా. బోటింగ్, పార్క్ సౌకర్యం కల్పించడంతోపాటు అహ్లదకరంగా తీర్చిదిద్దుతా.

ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎవరికి మున్సిపాలిటీని అప్పగిస్తే అభివ్రుద్ది చేస్తారో… కేంద్రం నుండి నిధులు ఎవరు తీసుకొస్తారో… ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదు. ఇప్పటి వరకు పైసా ఇయ్యలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేసి గెలిపిస్తే ఒరిగేదేమీ ఉండదు.

కిరాయిదారుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే.. యజమానులు వాళ్లను ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడతా. వాళ్లు స్థలం ఇస్తే ఎంపీ నిధులతో భవన సముదాయాన్ని నిర్మించి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అని అన్నారు.

అభివృద్ధి పనుల మ్యాప్ ను పరిశీలించి ఆర్డీవోను వివరాల అడిగి తెలుసుకుంటున్న బండి సంజయ్..

విలేకరులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్..





