
– బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానాలు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, మానవ సమాజం మనుగడ కోసం అనాదిగా సేవ చేస్తున్న పద్మశాలీయులు రాజకీయంగా ఎదగాలని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా ఎన్నికైన పద్మశాలి సమాజానికి చెందిన నాయకులకు బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి వోడ్నాల రవీందర్ తో కలిసి సన్మానం కార్యక్రమాలను నిర్వహించారు. మండలంలోని రాంపూర్, శాలపల్లి, సిరసపల్లి, పోతిరెడ్డిపేట, కందుగుల, కాట్రపల్లి గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికైన ప్రజాప్రతినిధులను సన్మానం చేశారు.
తదనంతరం జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర జనాభాలో 28 లక్షలకు పైచిలుకు ఉన్న పద్మశాలి కులస్తులు విద్యారంగంలో వైద్యరంగంలో వస్త్ర ఉత్పత్తి రంగంలో సేవ చేస్తున్నారని తెలిపారు. వివిధ రంగాలలో శ్రామికులుగా ఉన్నారని, ఎంతో నైపుణ్యతతో పనిచేసే పద్మశాలి కులస్తులు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పద్మశాలి కులానికి ఎలాంటి సహకారం లేదని 28 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాజకీయంగా కొద్దిమంది మాత్రమే ఉన్నారని కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడం పద్మశాలి కుల వెనుకబాటుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సేవా దృక్పథంతో ముందుకు వచ్చి వార్డు సభ్యులుగా సర్పంచులుగా ఉపసర్పంచులుగా ఎన్నికైన పద్మశాలి ప్రజాప్రతినిధులకు జిల్లా వ్యాప్తంగా సన్మానాలు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా వారికి రాజకీయ స్ఫూర్తిని తీసుకురావడమే లక్ష్యంగా పద్మశాలిల ఐక్యత కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్, జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, జిల్లా పద్మశాలి సంఘం కార్యనిర్వహక కార్యదర్శి వోడ్నాల రవీందర్, పద్మశాలి సంఘం మండల నాయకులు వంగ సత్యనారాయణ, పోతరాజు సంపత్, సర్పంచులు మూషం సంగీత గణేష్, మంతెన సుమలత సురేందర్, ఉప సర్పంచులు జడల అశోక్, ఇప్పలపల్లి రామకృష్ణ, వార్డు సభ్యులు ఆడెపు మార్కండేయ, కందకట్ల వనజ మురళి, తడిగొప్పుల భిక్షపతి, నిర్మలా రవి, గాజుల కుమారస్వామి, కోమటి శ్రీనివాస్, మూషం భిక్షపతి, పాత్రికేయులు గజంగి అఖిల్, జూపాక శివమణి తదితరులు పాల్గొన్నారు.

రాంపూర్ సర్పంచ్ దంపతులు సన్మానిస్తున్న నాయకులు…

పోతిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ దంపతులను సన్మానిస్తున్న సంఘం నాయకులు..







