Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి 16: భారత రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను ఐక్యంగా అడ్డుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల కోసం పోరాడే వారిని, నీతి నిజాయితీ గల వ్యక్తులను ‘అర్బన్ నక్సలైట్ల’ పేరుతో అక్రమంగా జైళ్లలో పెడుతోందని ఆయన విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలైన రూ. 15 లక్షల నగదు జమ, రైతు ఆదాయం రెట్టింపు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ఊసే లేదని ధ్వజమెత్తారు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారాన్ని కాపాడుకుంటున్నారని ఆరోపించారు.1925లో ఆవిర్భవించిన సిపిఐ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 4,500 మంది ప్రాణత్యాగంతో 3,000 గ్రామాలకు విముక్తి కల్పించిన చరిత్ర సిపిఐ దని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత ఈ పార్టీకి దక్కుతుందన్నారు.నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, సీతారామ వంటి ప్రాజెక్టుల సాధనలో సిపిఐ అలుపెరగని పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు.

ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయండి…సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండి, కొత్త రాజకీయ శక్తులతో కలిసి పనిచేయడం దేశ భవిష్యత్తుకు శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంది రవీందర్ రెడ్డి, హుజురాబాద్ టౌన్ అధ్యక్షులు గరిగ రాములు, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, నాయకులు రోషీత్, అనిల్, అఖిల్, సంధ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






