
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వాహనాల డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని వాటి వల్ల మన ప్రాణాలే కాకుండా ఇతర ప్రాణాలకు రక్షణ కలుగుతుందని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. ఆదివారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డుభద్రత నియమాలను పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. వాహనాల కండీషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలన్నారు. పరిమితికి లోబడి వాహనాల లోడ్ ఉండాలనీ, వాహనాలు నిర్లక్ష్యంగా నడుపడం, కండీషన్ లేని వాహనాలు నడపటంవల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. ప్రధానంగా రాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్లోడ్, రాంగ్ రూట్, కండిషన్ లేని వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలకు కారణ మవుతున్నాయన్నారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఎంవీఐ కంచి వేణు..





