
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
హక్కుల సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓసిల మహాధర్నా విజయవంతం చేయడానికి, ఏర్పాట్ల గురించి ఆదివారం ఓసి ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లాల నాయకుల సమావేశం హన్మకొండ పోస్టల్ కాలనీలోని హనుమాన్ దేవాలయం ఆవరణలో జరిగింది. గోపు జైపాల్ రెడ్డి, పోలాడి రామారావులు మాట్లాడుతూ రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.


మాట్లాడుతున్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి.
ఈడబ్ల్యూఎస్ పై కుట్రలు సాగనివ్వం…
రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమ లబ్దికోసం చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని విరుచుకుపడ్డారు. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలన్నారు. 50 శాతం దాటకుండా ఉన్న ప్రస్తుత రిజర్వేషన్ల లో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను ఆహ్వాన కార్డులను నాయకులు ఆవిష్కరించారు. అంతకు ముందు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో పోలాడి రామారావు కెప్టెన్ ను కలిసి మహాధర్నా కార్యక్రమం ఏర్పాట్ల గురించి వివరించి మద్దతు ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించిన కెప్టెన్ లక్ష్మీ కాంత రావుకు పోలాడి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఓసి ఐకాస రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీశ్ రెడ్డి, రాష్ట్ర, జిల్లాల నాయకులు నల్లా రాజిరెడ్డి, చాడ జైహింద్ రెడ్డి, కోరెళ్ళ సంజీవరెడ్డి, గంగిడి ప్రభాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, కామిడి శ్రీదర్ రెడ్డి, గణపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లతో పాటు ఉమ్మడి జిల్లా ఐకాస నాయకులు పాల్గొన్నారు.



మహాధర్నాకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను ఆహ్వాన కార్డులను నాయకులు ఆవిష్కరిస్తున్న దృశ్యములు..

మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో పోలాడి రామారావు కెప్టెన్ ను కలిసి మహాధర్నా కార్యక్రమం ఏర్పాట్ల గురించి వివరించి మద్దతు ఇవ్వాలని కోరుతున్న దృశ్యం





