Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమం మళ్లీ రాజుకుంది. హుజురాబాద్ జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం హుజురాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు. “కెమిస్ట్ – డ్రగిస్ట్ అసోసియేషన్”, “శ్రీ విగ్నేశ్వర ఆర్ఎంపి -పిఎంపి ల అసోసియేషన్” సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బస్సు డిపో చౌరస్తాలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ సైదాపూర్ చౌరస్తా మీదుగా డాక్టర్ బిఆర్. అంబేద్కర్ చౌరస్తా వరకు సంఘాల సభ్యులు “హుజురాబాద్ జిల్లా – మన హక్కు” అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ఆందోళన జరిపారు. వారి ఆందోళనతో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోజు సదానందం మాట్లాడుతూ…. హుజురాబాద్ కంటే జనాభా, వైశాల్యం, భౌగోళిక విస్తీర్ణంలో చిన్నవైన ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించినా అన్ని అర్హతలున్న హుజురాబాద్‌ను పట్టించుకోలేదనీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో వెంటనే హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, ఈ జిల్లాకు భారత మాజీ ప్రధాని, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా సాధన కోసం చేపట్టిన నిరసనతో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడటంతో టౌన్ సిఐ కరుణాకర్ ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ నాయకులు కర్ర పాపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, ఆర్ఎంపి పిఎంపీల మండల అధ్యక్షుడు కందగట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిలకమారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు అడ్డగట్ల కృష్ణమూర్తి, కొలిపాక జగదీష్, మంచికట్ల సదానందం, పిట్ట శ్రీనివాస్, ఇప్పనపల్లి శ్రీనివాస్, జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పొడిశేట్టి వెంకటరాజం, వేల్పుల రత్నం, చందుపట్ల జనార్ధన్, వేల్పుల ప్రభాకర్, వెంకటేష్, సందెల వెంకన్న, సొల్లు సారయ్య, సాదుల రవీందర్ బాబు, ఆర్ఎంపిలు, పిఎంపీలు, కెమిస్ట్ -అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు పాల్గొన్నారు.

బిఆర్. అంబేద్కర్ చౌరస్తా వరకు సంఘాల సభ్యులు “హుజురాబాద్ జిల్లా – మన హక్కు” అంటూ నినాదాలు చేస్తున్న నాయకులు…





