
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఫిబ్రవరి 20 :
హుజూరాబాద్ మండల పరిధిలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో దశాబ్దాలుగా స్మశాన వాటికగా ఉపయోగిస్తున్న భూమి ఆక్రమణకు గురవుతుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 65 ఏళ్లుగా ఎస్సీ (మాల, మాదిగ), బీసీ మరియు ఓసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు తమ పూర్వీకుల అంతిమ సంస్కారాల కోసం ఉపయోగిస్తున్న సర్వే నంబర్ 1559/ఎ, 1559/బి లోని సుమారు 2 ఎకరాల 23 గుంటల శిఖం భూమిపై ఇప్పుడు వివాదం నెలకొంది.
గ్రామస్థుల కథనం ప్రకారం.. 2007వ సంవత్సరం నుండి మహమ్మద్ వజీర్ అనే వ్యక్తి, తన కుమారులతో కలిసి ఈ ప్రభుత్వ భూమిని తమ సొంత ఆస్తిగా చెప్పుకుంటూ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. అంతిమ సంస్కారాల కోసం వెళ్లే వారిని అడ్డుకోవడమే కాకుండా, అక్కడ ఇప్పటికే ఉన్న పాత సమాధులను ధ్వంసం చేస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద పట్టా ఉందని సాకులు చెబుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ సమస్యపై 2013లో రెవెన్యూ సదస్సులో (దరఖాస్తు నం. 39551) మరియు 2019లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, నేటికీ ఎటువంటి శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. పేద ప్రజలకు అంతిమ యాత్రలో కూడా కష్టాలు తప్పడం లేదని, వర్షాకాలంలో కాలువ గట్ల వెంబడి శవదహనం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబుకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, ఆక్రమణదారుల నుండి శ్మశాన వాటిక భూమిని విడిపించాలని వారు కోరారు. జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, స్మశాన వాటిక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో వేల్పుల విజయ్ కుమార్, ఉప సర్పంచ్ జడల అశోక్, వార్డు సభ్యులు గడ్ల శ్రీధర్, బోగం జీవన్ కుమార్, బత్తుల చిన్న రాజయ్య మరియు ఇందిరానగర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రణవ్ బాబుకు వినతిపత్రం అందజేస్తున్న వేల్పుల విజయ్ కుమార్, ఉప సర్పంచ్ జడల అశోక్, వార్డు సభ్యులు గడ్ల శ్రీధర్, బోగం జీవన్ కుమార్, బత్తుల చిన్న రాజయ్య మరియు ఇందిరానగర్ గ్రామస్తులు





