
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే నిరుపేద పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధించాలని పరీక్షకు వెళ్లడానికి రవాణా ఖర్చులు, అభ్యాస దీపికలు, పరీక్ష ప్యాడులు ఇతర సామాగ్రి ఇచ్చి జయన్న పౌండేషన్ ఉదారత చాటుకుంది. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో హుజురాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులకు ఆర్థిక చేయుత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ ఎంపిటిసి గుడిపాటి సరితలు మండలంలోని 291 మంది విద్యార్థులకు పరీక్షలకు వెళ్లడానికి 700 రూపాయలు, పరీక్ష ప్యాడ్, అభ్యాస దీపికలు, ఇతర పరీక్ష సామాగ్రి అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థుల కు చేయూత నివ్వడానికి జయన ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ముందుకు వచ్చిన ఫౌండేషన్ అభిలాష అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తున్న ఫౌండేషన్ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ…. తాను చిన్నతనంలో అనుభవించిన కష్టాలను ప్రస్తుత తరుణంలో మరి బీద విద్యార్థి అనుభవించకూడదనే ఉద్దేశంతో తన ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా చేత నివ్వాలని సంకల్పించామని అన్నారు. విద్యపై ఖర్చు చేయడం ఖర్చుగా భావించరాదని అది పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. గత ఏడాది సైతం హుజురాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని అదేవిధంగా ఈ ఏడాది కూడా ముందుకు వచ్చానని అన్నారు. కేవలం కార్పొరేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకే అన్ని రంగాల్లో సేవలు అందుతాయని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అలాంటి మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ఖర్చు కోసం కాకుండా విద్యార్థుల మేలు కోసం ఈ పని చేస్తున్నానని అన్నారు. ఆయన సతీమణి గుడిపాటి సరిత మాట్లాడుతూ…. పేద ప్రజలకు సేవ చేయాలనే తన భర్త జైపాల్ రెడ్డి సంకల్పం ని తాను కూడా బలపరుస్తూ ఆయన వెంట సేవ చేయడానికి వస్తున్నానని అన్నారు ప్రతి ఏడాది పదవ తరగతి విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా మండలంలోని వృద్ధులందరికీ ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు జరిపించామని అన్నారు. ఇంతే కాకుండా ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం సింగపూర్‌లో దళిత కాలనీలో మంచినీటి సౌకర్యం కల్పించామని అన్నారు. వైద్య అవసరాల నిమిత్తం ఉచితంగా అంబులెన్స్‌ను పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్ధులు ఎలాంటి ఒత్తిళ్ళకు గురికావద్దని, లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్ధుల ఉన్నత చదువులకు తనవంతు సహాయం చేస్తూనే ఉంటానన్నారు. సుమారు 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరినీ శాలవాలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పైన పూల వర్షం కురిపించగా దీంతో విద్యార్థులు కేరింతలు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ ఎండి ఖాళీక్ హుస్సేన్, హెచ్ఎం బొరగాల తిరుమల, DM శోభారాణి, సమ్మిరెడ్డి, అనురాధ, ఖైరున్నీసా, ప్రదీప్, చెల్మల సంజీవరెడ్డి, పరాంకుశం వెంకటేశ్వరస్వామి, చిరంజీవి, విశ్రాంత GHM వేల్పుల రత్నం, విశ్రాంత టీచర్ పలకల ఈశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




మండలంలోని 291 మంది విద్యార్థులకు పరీక్షలకు వెళ్లడానికి 700 రూపాయలు, పరీక్ష ప్యాడ్, అభ్యాస దీపికలు, ఇతర పరీక్ష సామాగ్రి అందించగా ఆనందం వ్యక్తులు చేస్తున్న విద్యార్థులు..

ప్రధానోపాధ్యాయులను సన్మానిస్తున్న జయన్నా ఫౌండేషన్ నిర్వాహకులు జైపాల్ రెడ్డి సరిత…





