
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి కొత్తపల్లి గ్రామాల సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజులుగా డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ఏర్పాటైన అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం అవుతుండగా దానిని అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఖాతాలో వేసుకోవడానికి పోటాపోటీ పడుతుండడంతో నిజంగా ఉద్యమానికి సహకరిస్తున్న సామాజిక సేవకులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు, అన్ని వర్గాల వారు ఎవరికి మద్దతు ఇవ్వాలో.. ఎవరికి అండగా నిలవలో తెలియక సతమతమవుతున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఇటీవల హుజురాబాద్ పట్టణ బంద్కు పిలుపునివ్వగా బాహాటంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు తాము బందులో పాల్గొనడం లేదని, బంద్ కు మద్దతు ఇవ్వడం లేదని తెగేసి చెప్పడం తెలిసిందే. అదేవిధంగా నేడు ఏడున, 8న 48 గంటల నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించిన స్థానిక శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డికి అండగా ఉండాల్సి వస్తుందని జేఏసీ నాయకులను వెంటవేసుకొని అధికార పార్టీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్లను 9 వాహనాలల్లో హుటాహుటిన ఎమ్మెల్యే దీక్ష రోజుననే హైదరాబాద్కు తీసుకువెళ్లి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు వ్యూహం పన్నడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు అంతుచిక్కడం లేదు. అంతేగాక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక్కరోజు బందుకు పిలుపు ఇచ్చిన రోజుననే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాదులో అధికార పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేయడం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేపట్టిన బందు విజయవంతం క్రెడిట్ పోకుండా చేయడానికి పన్నిన కుట్రగా పలువురు భావిస్తున్నారు. అదేవిధంగా నేడు సైతం ఆయన దీక్ష చేపట్టి ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలియజేసే రోజుననే కావలసుకొని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు జేఏసీ నాయకులను వెంట తీసుకొని హైదరాబాదుకు వెళ్లడంలో ఆంతర్యమేమిటో ప్రజలు గ్రహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో ఉండగా వెళ్లిన అధికార పార్టీ నేతలు జిల్లా ఇన్చార్జిమంత్రికి కలిసినంత మాత్రాన ఏమి లాభం చేకూరుతుందంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి హుజురాబాద్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు డంపింగ్ యార్డ్ ఎత్తివేసేందుకు ఎవరి ప్రయత్నంలు వారు చేస్తూనే క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నడం ప్రజలకు రుచించడం లేదు.

హైదరాబాద్కు తరలి వెళ్తున్న హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, పాలకవర్గ సభ్యులు, అధికార పార్టీ నాయకులు.






