
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ మండలంలోని సిరసపల్లి -కొత్తపల్లి గ్రామాల సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వ్యతిరేక అఖిల పక్ష కమిటీ’ ఏర్పాటుచేసిన దీక్షా శిబిరం వద్ద 24 గంటల నిరసన దీక్ష చేపట్టిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేదిక వద్ద రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని దీక్షా శిబిరం వద్ద రాత్రి పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల విత్తనోత్పత్తి దెబ్బతిని రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. గాలి, నీరు కలుషితం. కావడమే కాకుండా, సమీపంలోని గుట్టల్లో నివసించే వందలాది నెమళ్లు, వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
ఉవ్వెత్తున ఎగిసిన నిరసన..
గత 16 రోజులుగా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేలాది మంది ప్రజలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దీక్షకు మద్దతుగా నిరసన దీక్షలు చేపట్టారు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తో పాటు మండలంలోని 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినప్పటికీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు ఆందోళనలో పాల్గొనడం లేదని పలువురు సభ వేదికగా ఆరోపించారు. “ప్రజల ఆరోగ్యాన్ని, పచ్చని పంట పొలాలను బలిపెట్టి చేసే ఇటువంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమనీ, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.” అని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంగళవారం ఎమ్మెల్యే దీక్ష సాక్షిగా పలువురు హెచ్చరించారు.

దీక్షా శిబిరం వద్ద నిద్రిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..


దీక్ష శిబిరం వద్ద ఎమ్మెల్యేతో పాటు నిద్రిస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..





