Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హుజురాబాద్ పట్టణం, జమ్మికుంట పట్టణం సహా నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ ఐదు మండలాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొందన్నారు. వేసవి తీవ్రతతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళితబంధు పథకం రెండో విడతను త్వరితగతిన ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని అన్నారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆలస్యం చేయకుండా అమలు ప్రక్రియను పూర్తి చేయాలన కోరారు.
వీణవంక మండల కేంద్రంలోనీ డబుల్ రోడ్డు, రాచపల్లి రోడ్డు, పోతిరెడ్డిపల్లి రోడ్డు, కోర్కల్ రోడ్డు, నాగంపేట రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన మక్కజొన్న కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదలను గుర్తించి ఎంపిక చేయాలని అన్నారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.





