
–బీసీల అభ్యున్నతికి ఆకుల రాజేందర్ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించిన
–మున్నూరు కాపు జర్నలిస్టుల పోరం నాయకులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట), జూలై 1: కరీంనగర్ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంట మండల మున్నూరు కాపు జర్నలిస్టులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎబూషి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడని అన్నారు. బీసీ వర్గాల సమస్యలను నిరంతరం ప్రస్తావిస్తూ వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తున్న ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ పదవిలో ఆయన మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లాలోని బీసీ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం జిల్లా నాయకులు పంతాటి రవీందర్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రజల మధ్య పని చేస్తూ ఈ స్థాయికి ఎదిగారని తెలిపారు. పార్టీ ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమం, యువత అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం మరింతగా శ్రమిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలో బీసీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సన్మానానికి స్పందించిన ఆకుల రాజేందర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, యువతకు అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. మున్నూరు కాపు జర్నలిస్టులు అందించిన ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టులు ఎబూషి శ్రీనివాస్, పంతాటి రవీందర్, దాట్ల శ్రీనివాస్, కోలకాని రాజేందర్, ఎబూషి సంపత్ తదితరులు పాల్గొని ఆకుల రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.





