
—సానుకూలంగా స్పందించిన కమిషనర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్
(హైదరాబాద్): ప్రభుత్వ శాఖల నుంచి పత్రికలకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి పత్రికలను ఆదుకోవాలని తెలంగాణ మీడియం, స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎంఎస్పీజేఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డిని కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపూరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పెండింగ్ బకాయిలకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే ఆర్దిక శాఖ మంత్రి పరిశీలనలో ఉన్నాయని, బకాయిలు త్వరలోనే చెల్లించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాపూరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా చిన్న, మధ్యతరహా దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు క్రమం తప్పకుండా ప్రచురితమవుతున్నాయని తెలిపారు. ఈ రంగంపై ఆధారపడి సుమారు ఐదువేల మంది పాత్రికేయులు పనిచేస్తున్నారని చెప్పారు. చిన్న పత్రికల మనుగడ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. చిన్న, మధ్యతరహా పత్రికల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో చిన్న, మధ్యతరహా పత్రికలకు 30 శాతం వాటా కేటాయింపును అమలు చేయాలన్నారు. ప్రకటనల బిల్లుల సమర్పణకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేసి, బిల్లుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలన్నారు. పత్రికల ప్రచురణ క్రమబద్ధత పరిశీలనకు ఆన్లైన్ విధానం అమలు చేయాలన్నారు. పత్రికల ఎంపానల్మెంట్ ప్రక్రియను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించి, పక్ష పత్రికలకు కూడా అవకాశం కల్పించాలన్నారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటనల వార్తా కవరేజీలో చిన్న, మధ్యతరహా పత్రికలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ప్రమాద బీమా కల్పించాలని కోరారు. మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులకు శిక్షణ, పునశ్చరణ కోర్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీ పాలక మండలిలో టీఎంఎస్పీజేఏకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, వాటిలో పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని బాపూరావు కోరారు. సమస్యలపై అధికారులతో తక్షణ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, కంతేటి రమాదేవి, మిట్టపల్లి సురేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





