
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: జీవితంలో ఏడేళ్ల దాటిన అనుభవం, కాలంతో పాటు నడిచిన జ్ఞానం, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ధైర్యం… వీటన్నింటినీ ఒకే వేదికపైకి తెస్తే సమాజానికి లభించే దిశానిర్దేశం అమూల్యం. సరిగ్గా ఇదే ఆలోచనతో హుజూరాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ “మార్నింగ్ ఫ్రెండ్స్” ఒక అరుదైన మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వచ్చే నవంబర్ 1, 2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు స్థానిక వి.ఎల్.ఆర్. ఫంక్షన్ హాల్ వేదికగా “అనుభవాల సమ్మేళనం” (సప్తతి సౌహార్థం) పేరుతో 70 ఏళ్లు పైబడిన వృద్ధుల సదస్సును నిర్వహించబోతోంది. హుజూరాబాద్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని రీతిలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు స్థానికంగా విశేషంగా చర్చనీయాంశమైంది.
వాకింగ్ ట్రాక్ నుంచి పుట్టిన సామాజిక చైతన్యం
హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ప్రతిరోజూ ఉదయాన్నే నడిచే కొందరు ఉత్సాహవంతుల ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ “మార్నింగ్ ఫ్రెండ్స్” సంస్థ.
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితర విభిన్న రంగాల వారు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ, కేవలం వాకింగ్‌కే పరిమితం కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
- పర్యావరణ స్పృహ: ప్లాస్టిక్ నిషేధం, నీటి పొదుపు, మొక్కల పెంపకం వంటి అంశాలపై ప్రజల్లో నిరంతరం చైతన్యం తెస్తోంది.
- ఆర్ధిక చేయూత: కేవలం సభ్యుల విరాళాలతోనే అత్యవసర వైద్య సాయం, పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక అండనందిస్తోంది. ఇటీవల కాట్రపల్లికి చెందిన నిరుపేద బాలిక శరణ్య తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ఈ సంస్థ అందించిన సాయం వారి మానవత్వానికి నిదర్శనం.
ప్రస్తుతం ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఎస్.సి. కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావుల ప్రోత్సాహంతో పలు సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి.
అనుభవాల నిధి… యువతరానికి స్పూర్తి!
హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధితో పాటు ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, రాజకీయ చైతన్యంపై వయోధికుల అనుభవాలను సేకరించి రాబోయే తరణానికి అందించాలనే వారి ఆలోచన ఆధారంగా ఈ సదస్సును రూపుదిద్దారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సామాజిక ఉద్యమకారులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, వర్ధినేని రవీందర్ రావు, రాజపల్లి సర్పంచ్ కే.మల్లారెడ్డిలు మాట్లాడుతూ —
“వయోధికులను ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల వారికి మానసిక ఉల్లాసంతో పాటు ఎంతో హాయి లభిస్తుంది. ఊరి ప్రగతికి, సామాజిక సమస్యల పరిష్కారానికి వారి సుదీర్ఘ అనుభవాలు దిక్సూచిగా ఉపయోగపడతాయి. ఈ వేదికపై వివిధ రంగాలకు చెందిన 100 మంది సీనియర్ సిటిజన్లను ఘనంగా చిరు సన్మానంతో గౌరవించనున్నాం.” అని పేర్కొన్నారు.
వయసు పైబడిన వారిని సమాజానికి దూరంగా ఉంచకుండా, వారిని గౌరవిస్తూ వారి జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు వాడుకోవాలనుకోవడం ఒక అభినందనీయమైన పరిణామం. “మార్నింగ్ ఫ్రెండ్స్” ఆధ్వర్యంలో జరగనున్న ఈ “సప్తతి సౌహార్థం” మరెన్నో ప్రాంతాలకు మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు! (సేకరణ: ఆవునురి సమ్మయ్య గారి సహకారంతో..)




