
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో సేవల నిర్వహణ, రికార్డుల నమోదు తీరును శనివారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీడీ, గైనకాలజీ, అత్యవసర చికిత్స విభాగం, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది సహా పలు విభాగాలను సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.




తనిఖీల సందర్భంగా మందుల నిల్వలు, వినియోగ రికార్డుల్లో తీవ్ర లోపాలను అడిషనల్ కలెక్టర్ గుర్తించారు. ఉచిత మందులు ఇంకా సరఫరా చేయకముందే రికార్డుల్లో నమోదు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అనస్థీషియా ఇంజెక్షన్ల వినియోగ రికార్డుల్లో వ్యత్యాసాలు ఉండటంపై తీవ్ర అసంతృప్తి చెందారు. సరఫరా పూర్తయ్యాకే వివరాలను రికార్డు చేయాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.

అనంతరం ఆర్ఎంఓ ఛాంబర్లో డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్, వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. “సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా ప్రతి రోగికీ నాణ్యమైన చికిత్స అందించాలి” అని స్పష్టం చేశారు. ఆస్పత్రిని ప్రతి 15 రోజులకు ఒకసారి ఉన్నతాధికారులు సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో అసౌకర్యాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడాన్నీ ప్రత్యేక విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కలెక్టర్ హరిప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, ఆర్డీఓ జలకుమారి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హకీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ప్రభుదాస్, సుపరింటెండెంట్ జీ రవీందర్, తహసీల్దార్ జక్కని నరేందర్, కమిషనర్ బి కిషన్, స్థానిక కౌన్సిలర్ కోయల్ కార్ భారతి తదితరులు పాల్గొన్నారు.




