
–30% కమీషన్ ఆరోపణలపై విచారణ అధికారికి ఉపసర్పంచ్ లిఖితపూర్వక వివరణ
–ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకుంటే తప్పుడు ఆరోపణలా?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తనపై సర్పంచ్ గారు చేసిన 30 శాతం కమీషన్ డిమాండ్ మరియు పనులకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలను ఖండిస్తూ ఉపసర్పంచ్ నేరుగా మండల పంచాయతీ అధికారి (MPO)కి సమగ్ర వివరణతో కూడిన దరఖాస్తును సమర్పించారు.
మహేశ్వరి ఎలక్ట్రికల్స్ (జమ్మికుంట) పేరిట జరిగిన రూ.1,25,000/- కొనుగోలులో మార్కెట్ ధరలతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉండటం, నిబంధనలు పాటించకపోవడంతోనే తాను చెక్కుపై సంతకం నిరాకరించానని, అంతేతప్ప పనులకు అడ్డుపడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకతవకలపై ఇప్పటికే డీఎల్పీఓ, ఎంపీఓ మరియు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పంచాయతీ రికార్డులు, నోట్ ఫైళ్లు మరియు తీర్మానాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్‌పై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 37 ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన వినతిపత్రంలో కోరారు. ఈ అంశం స్థానిక రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.
చెల్పూర్ గ్రామపంచాయతీలో అధికారుల విచారణ :
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామపంచాయతీలో మంగళవారం ఇన్చార్జి ఎంపీఓ రాజేందర్ ఆరోపణల పై విచారణ జరిపారు. పాలకవర్గం ఆమోదించిన బిల్లులపై సంతకాలకు ఉప సర్పంచ్ 30 శాతం కమిషన్ డిమాండ్ చేశారన్న ఆరోపణలు సర్పంచ్ కస్తూరి చేయడంతో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కస్తూరి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పలువురు వార్డు సభ్యులను ఆయన విచారించి పలు రికార్డులను పరిశీలించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను సర్పంచ్ అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారని ఎంపీఓ తెలిపారు.





