
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ పునరుద్ధరణ, అభివృద్ధిలో తన సేవలను గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఈసీ మెంబర్ అభ్యర్థిగా (సీరియల్ నెం. 8) పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీనియర్ జర్నలిస్ట్, మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి నర్సింహారెడ్డి క్లబ్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.


గత 33 సంవత్సరాలుగా జర్నలిజంలో, ప్రజాసేవలో కొనసాగుతున్నానని పేర్కొన్న ఆయన.. 2006 మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని 2014, 2019, 2026 మున్సిపల్ ఎన్నికల్లో 26వ వార్డు నుంచి తన సతీమణిని కౌన్సిలర్‌గా గెలిపించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

క్లబ్ పునరుద్ధరణలో కీలక పాత్ర:
క్లబ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు సూచనల మేరకు 2014 నుండి 2020 కరోనా సమయం వరకు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ క్లబ్ పురోగతికి కృషి చేశానని వివరించారు. కెప్టెన్ ఆదేశాలతో పట్టణంలో 84 మంది కొత్త సభ్యులను క్లబ్లో చేర్పించినట్లు గుర్తుచేశారు.
అలాగే క్లబ్ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ యత్నాలను పాలకవర్గంలో ఉండి గట్టిగా వ్యతిరేకించానని, పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి అనుమతులు సాధించడంలో కీలక పాత్ర పోషించానని తెలిపారు.


నేడు హుజురాబాద్ క్లబ్ ఈ స్థాయిలో నిలవడానికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిరంతర కృషి, దూరదృష్టి కారణమని కొనియాడారు. భవిష్యత్తులోనూ క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని, ఈసీ మెంబర్‌గా (S.No. 8) తనను గెలిపించి ఆశీర్వదించాలని కేసిరెడ్డి నర్సింహారెడ్డి కోరారు.





