
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజురాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


అనంతరం, పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను, విశిష్టతను వివరించారు.


”రాజ్యాంగం అనేది కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదు… అది ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం, సమానత్వానికి ప్రతీక, భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే” అని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వాన్ని అందించిందని కొనియాడారు.
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే రాజ్యాంగ స్ఫూర్తితో, సమానత్వం మరియు సామాజిక న్యాయం కలిగిన ఆదర్శ సమాజ నిర్మాణానికి విద్యార్థులు, యువత కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (MEO) శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపల్ అర్చన, మున్సిపల్ కౌన్సిలర్లు, జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




