
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నులు మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం. రఘునందన్ రావు (IAS) సమర్థవంతమైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. 2027 ఫిబ్రవరిలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆ తర్వాత కూడా ఆయన్ను ఇదే కీలక బాధ్యతల్లో యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో ఆయన చూపిన చొరవను గుర్తిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి అడిషనల్ కమిషనర్ వరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పించి, ఉద్యోగులందరి గుండెల్లో నిలిచిన రఘునందన్ రావుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.


పన్నుల వసూళ్లలో సరికొత్త చరిత్ర:
ఎం. రఘునందన్ రావు నేతృత్వంలో 2026వ సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ (GST) మరియు వాణిజ్య పన్నుల వసూళ్లు ఆల్-టైమ్ రికార్డులను తిరగరాశాయి. ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయి:
పరిపాలనా సంస్కరణలు: పన్ను వసూళ్ల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో నూతనంగా వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ (JC) కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు 25 కొత్త సీటీఓ (CTO) సర్కిళ్లను ప్రారంభించారు.
ఏప్రిల్ 2026 రికార్డు: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర జీఎస్టీ (SGST) వసూళ్లు 35 శాతం వృద్ధితో ₹4,621 కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి.
జూలై 2026 రికార్డు: మొత్తం వాణిజ్య పన్నుల ఆదాయం ₹7,865 కోట్లకు చేరుకుని అత్యధిక నెలవారీ వసూళ్ల రికార్డును నెలకొల్పింది. ఇందులో జీఎస్టీ వాటా ₹4,452 కోట్లుగా నమోదైంది. అంతేగాక ప్రతి నెల నెల వసుళ్లలో పురోగతి సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించారు.
పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం: సరుకుల సరఫరా లేకుండానే నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సుమారు ₹300 కోట్ల మేర పన్ను ఎగవేతను సమర్థవంతంగా అరికట్టారు.
పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడం, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ స్థాయి వృద్ధి సాధ్యమైందని, రఘునందన్ రావు కొనసాగింపుతో శాఖ మరింత బలోపేతం అవుతుందని ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ తాల్లపెల్లి రమేష్ గారు, 28వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.




