
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (patanchuru)ఇంట్లో ఈడీ
సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన నివాసంతో పాటు కుటుంబసభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు గురువారం తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుండే ప్రారంభించిన ఈ రైడ్స్ ను సంతోష్ గ్రానైట్స్ తో పాటు దీని అనుభంద సంస్థల కార్యాలయాలు, బినామీలకు చెందిన పలు ప్రాంతాల్లో సాగుతున్నాయి. గతంలో పటాన్చెరు పోలీసులు నమోదు చేసిన కేస్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగినట్టుగా పలువురు భావిస్తున్నారు. ఈ కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA)లో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. గూడెం మధసూధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై పటాన్చెరు పోలీసులు ఇంతకుముందే అరెస్ట్ కూడా చేశారు. మైనింగ్ తవ్వకాలలో అక్రమాలకు పాల్పడడంతో పాటు మితి మీరిన తీరు ప్రదర్శించారంటూ అప్పటి మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు పరిమితికి మించి చట్టాన్ని అతిక్రమించి తవ్వకాలు జరిపారని, గడువు ముగిసిన తరువాత కూడా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు క్వారీని కూడా సీజ్ కూడా చేశారు. అంతేకాకుండా అప్పటి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఆర్డీఓ రవిందర్ రెడ్డిలతో పాటు అధికారుల బృందంతో కూడిన విచారణ కమిటీ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసింది. లక్షారంలోని మధుసూధన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో అక్రమ మైనింగ్ సాగుతోందన్న విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగి ఉంటుందని భావించిన ఈడీ గూడెం మధుసూధన్ రెడ్డితో పాటు అతని బంధువులు, బినామీలకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇండ్లపై ఈడి దాడులు నిర్వహించడం తీవ్ర సంచలనానికి గురిచేస్తుంది. ఇంకా ముందు ముందు ఎంతమంది ఇండ్లలో దాడులు చేస్తారోనని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భయాందోళన చెందుతున్నారు.
