
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఆడి కౌశిక్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని మంత్రిని పత్రికాముఖంగా పిలుపునియ్యగా రాకపోవడంతో ఆయన వేచి చూసి వెనుతిరిగారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నేను విసిరిన సవాళ్లను స్వీకరించి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తాను ఫ్లై యాష్ రవాణా విషయంలో అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తారని భావించాను.. కానీ ఎందుకు రాలేదు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పొన్న ప్రభాకర్ తాను గొప్ప నీతిమంతుడిని అని చెప్పుకుంటున్నారు..ఫ్లై యాష్ విషయంలో రూ.100 కోట్ల అవినీతికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడ్డారని తాను ఆరోపిస్తే ఇప్పటివరకు మంత్రి పెదవి విప్పలేదునీ పేర్కొన్నారు. నా ఆరోపణలపై ఆయన లీగల్ నోటీసు పంపించారు.. ఆయన లీగల్ నోటీసులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని స్పష్టం చేశారు.
ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి ఆలయం. నాకు దేవుడిపై నమ్మకం విశ్వాసం ఉన్నాయి, అవినీతికి పాల్పడలేదని పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తానని కూడా బహిరంగంగా ప్రకటించానన్నారు. నిజంగానే పొన్నం ప్రభాకర్ నిజాయితీపరుడు అయి ఉంటే ఈరోజు తాను విసిరిన సవాల్ స్వీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. సరిగ్గా 11 గంటలకు వస్తానని చెప్పాను వచ్చాను మరి పొన్నం ఎందుకు రాలేదు? నా సవాల్ ను స్వీకరించలేదంటేనే తెలిసిపోతోంది.. పొన్నం ప్రభాకర్ తాను 100 కోట్ల స్కాం చేశానని పరోక్షంగా అంగీకరించారని, ఇది తద్వారా నిరూపణ కూడా అయింది అని కౌశిక్ పేర్కొన్నారు.
నా మీద ఆరోపణలు వస్తే నిన్న నేను కాంగ్రెస్ పార్టీ సవాల్ ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు చెల్పూరు హనుమాన్ దేవాలయానికి బయలుదేరుతుంటే నన్ను అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నేను సిపిని, ఏసీపిని, సిఐని చిల్పూర్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని.. అవసరమైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కడినే వెళ్తానని రిక్వెస్ట్ చేశాను.. అయినా వారు నన్ను అనుమతించలేదన్నారు. అయినప్పటికీ.. ఇచ్చిన మాట ప్రకారం.. తడి బట్టలతో వెళ్లి ఇంటినే గుడిలా భావించి వెంకటేశ్వరస్వామి కండువా ధరించి హనుమాన్ చిత్రపటంతో తడి బట్టలతో ఎవరి వద్ద ఒక రూపాయి తీసుకోలేదని అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేశానన్నారు. నా నిజాయితీని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ముందు నిరూపించుకున్నాను అని స్పష్టం చేశారు. నా నిజాయితీని యావత్ తెలంగాణ ప్రజలకు నిరూపించుకున్నాను అని తెలిపారు.
కానీ పొన్నం ప్రభాకర్ తన సవాల్ ను స్వీకరించలేదు.. తాను రమ్మని చెప్పిన పొన్నం ప్రభాకర్ ఎందుకు రాలేదు? పొన్నం ప్రభాకర్ తన అవినీతికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు! తను గతంలో కూడా ఆధారాలు చూపించానని కౌశిక్ తెలిపారు. ఇదిగో చూడండి ఇది ఫ్లై యాష్ కు సంబంధించిన పర్మిట్ బిల్లు.. ఇందులో ఎన్ని టన్నుల యాష్ తీసుకు వెళుతున్నారో రాయడం లేదు.. ఇందులో సంబంధిత సిబ్బంది యొక్క సంతకం ఉన్నది.. అవుట్ పాస్ ఇచ్చారు.. మీరు స్పష్టంగా చూడవచ్చు అంటూ మరొకసారి పలు రసీదులు చూపించారు. నిజానికి దీనికి జిఎస్టి వే బిళ్ళు కూడా ఉండాలి కానీ మేము అది అడగడం లేదని, ఫ్లై యాష్ లారీలను తాను నేరుగా పట్టపగలు హుజురాబాద్ లో పట్టుకున్నాను.. దాన్ని వే బ్రిడ్జి పై చూస్తే ఒక్కో లారీ 76 టన్నులకు పైగా ఉందని తెలిపారు.. నిబంధనల ప్రకారం 16 టైర్ల లారీలో 36 టన్నుల యాష్ మాత్రమే తీసుకువెళ్లాలి కానీ ఇక్కడ నిబంధనలను తుంగలో తొక్కారని స్పష్టంగా అర్థం అవుతుంది కానీ పొన్నం ప్రభాకర్ తెలివిగా ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదని చెప్తున్నారని కాశిక్ రెడ్డి ఆరోపించారు. రవాణా శాఖ మంత్రిగా ఈ వ్యవహారంలో నీకు సంబంధం లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్న అని చెప్పారు. రవాణా మంత్రి ఆధ్వర్యంలో నిబంధనలను తుంగలో తొక్కి విలువైన, ప్రజలకు ఉపయోగపడే రోడ్లను నాశనం చేస్తున్నారని, గత తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రోడ్లను నిర్మాణం చేస్తే.. అధిక లోడుతో లారీలకు అనుమతులు ఇచ్చి రోడ్లను నాశనం చేస్తున్నారని కౌశిక్ మండిపడ్డారు. ఫ్లై యాష్ రోడ్లమీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయని, పొన్నం ప్రభాకర్ శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. అధికారులు, మంత్రులు ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు వారందరి వివరాలు బ్లాక్ బుక్ లో నమోదు చేస్తున్ననని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారని, అవినీతికి పాల్పడుతున్న అధికారులకు మంత్రులకు మళ్లీ బ్లాక్ డేస్ రాక తప్పదని హెచ్చరించారు. బ్లాక్ డైరీలో మొట్టమొదటి పేరు పొన్నం ప్రభాకర్ దే అని మీడియా సమక్షంలోనే దీన్ని రాస్తున్న అన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ స్కాన్ అని డైరీలో రాసి దాన్ని పాత్రికేయులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రదర్శించారు. సీఎంగా కేసీఆర్ మళ్లీ వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ తిన్న 100 కోట్లు కక్కిస్తామాన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని, ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు స్కాములు చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు మాత్రం అమలు చేయలేదని, పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ స్కేమ్ లో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈరోజుతో నిరూపణ అయిపోయిందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట హుజురాబాద్ నియోజకవర్గంకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.








