
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ అండ్ డైరెక్టర్ దేవసేనను తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆమె ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యవస్థాపన, బదిలీలు-2024లో భాగంగా బదిలీ కాబడిన ఎస్జీటీ ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలని అలాగే వివిధ కారణాలతో వారు కోరుకున్న ప్లేస్ కాకుండా ఇతర ప్లేసెస్ అలాట్ చేయబడిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను సవరించి న్యాయం చేయాలని ప్రాతినిథ్యం చేస్తున్న తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి ఆమెని కోరారు. దీనికి స్పందించిన కమిషనర్ తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంపై ఈరోజు డీఈఓలకు మరియు ఆర్జేడీలకు టెలికాన్ఫరెన్స్ లో సూచనలు చేస్తానని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.






