
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో గాజబోయిన మల్లయ్య(37) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య తన అత్తగారింటి వారు ఇచ్చిన పొలముతో పాటుగా అత్తగారి పొలంను సాగు చేసేందుకు కేజీ విల్ ట్రాక్టర్ తో దున్నేందుకు సోమవారం సాయంత్రం పొలానికి వెళ్ళాడు. కొద్దిసేపటికి మల్లయ్య భార్య లావణ్య ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే గ్రామానికి చెందిన మల్లయ్య స్నేహితుడు హరీష్ కు ఫోన్ చేసి మల్లయ్య ఆచూకీ కనుగోనమని చెప్పగా ఎంతకీ లభించలేదు. మంగళవారం తెల్లవారుజామున అంబాల ప్రభాకర్ అనే రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో కేజీవిల్ ట్రాక్టర్ సమీపంలో బురదలో పడి మృతి చెంది ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సీఐ బొల్లం రమేష్, ఎస్సై సాంబయ్య వారి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. లావణ్య మల్లయ్యను కేజ్ విల్ ట్రాక్టర్ తో తొక్కి చంపినట్లు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. సమగ్ర విచారణ జరిపితే మల్లయ్య మృతి చిక్కుముడి వీడే అవకాశం ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.







